వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. అదే గదిలో ఆత్మహత్య చేసుకున్న పనివాడు!

  • పదేళ్లుగా నమ్మకంగా మెలిగిన పనిమనిషి ఘోరం
  • వృద్ధురాలు మరణించడంతో ఉరి వేసుకున్న పనిమనిషి
  • బెంగళూరులో దారుణం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బెంగళూరులోని కేఏఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా మెలిగిన పనిమనిషి.. ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఈ ఆకృత్యాన్ని తట్టుకోలేక ఆమె చనిపోవడంతో పనిమనిషి అదే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేరాత్రి దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగి రావడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళూరుకు చెందిన బాధిత కుటుంబం కేఏఎస్ కాలనీలో స్థిరపడింది. ఇంటి యజమాని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుండగా.. ఆ దంపతుల కుమార్తె (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ కుటుంబంలో తమిళనాడుకు చెందిన దేవరాజు (45) పదేళ్లుగా పనిచేస్తున్నాడు. తొలుత సమీపంలోని ఓ హాస్టల్ లో ఉంటూ వీరి ఇంట్లో పనిచేస్తుండేవాడు. అయితే, దేవరాజు ప్రవర్తనపై నమ్మకంతో ఆ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పారు. దేవరాజు రోజూ ఇంట్లో పనులు చక్కబెట్టి రాత్రిపూట హాల్ లో పడుకునే వాడు.

ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగివచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తెరవకపోవడంతో కూతురుకు ఫోన్ చేయగా.. ఫస్ట్ ఫ్లోర్ లో పడుకున్న ఆ యువతి వచ్చి తలుపు తీసింది. లోపలకు వెళ్లిన యజమానికి దేవరాజు కనిపించలేదు. అక్కడి నుంచి బెడ్ రూంలోకి వెళ్లగా.. బెడ్ పై అచేతనంగా పడి ఉన్న భార్యను, అదే గదిలో ఉరితాడుకు వేళాడుతున్న దేవరాజును చూసి గట్టిగా అరిచాడు.

ఆయన కుమార్తె ఈ దారుణాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. రెండు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అత్యాచారం కారణంగా వృద్ధురాలు మరణించిందని.. అదిచూసి భయాందోళనకు గురైన దేవరాజు ఉరి వేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.


More Telugu News