రామలీల నాటకంలో విషాదం.. 'రావణుడి' కన్ను పోగొట్టిన 'రాముడు'.. కేసు నమోదు!

  • యూపీలో రామలీల ప్రదర్శనలో అపశ్రుతి
  • రాముడి పాత్రధారి వేసిన బాణం రావణుడి కంటికి గాయం
  • చికిత్స అందించలేదని, కులం పేరుతో దూషించారని బాధితుడి ఆరోపణ
  • రాముడి పాత్రధారితో పాటు నిర్వాహకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన రామలీల ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. రావణుడి వధ ఘట్టంలో రాముడి పాత్రధారి వేసిన బాణం గురితప్పి, రావణుడి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కంటికి తగలడంతో తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు రాముడి పాత్రధారితో పాటు కార్యక్రమ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
షాగంజ్‌లో గతేడాది నవంబర్ 13న రామ్‌సనేహీ సింగ్ అనే వ్యక్తి రామలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సునీల్ కుమార్ రావణుడి పాత్ర పోషిస్తుండగా, నైతిక్ పాండే రాముడిగా నటించాడు. రామ-రావణ యుద్ధ ఘట్టం ప్రదర్శిస్తున్న సమయంలో నైతిక్ పాండే వేసిన బాణం.. రావణుడి కిరీటానికి బదులుగా సునీల్ కుమార్ కంటికి బలంగా తాకింది. దీంతో అతని కంటి నుంచి రక్తం వ‌చ్చి తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే, ప్రమాదం జరిగినప్పటికీ నిర్వాహకుడు గానీ, రాముడి పాత్రధారి గానీ తనకు వైద్య సహాయం అందించలేదని బాధితుడు సునీల్ కుమార్ ఆరోపించాడు. చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని పలుమార్లు కోరినా వారు నిరాకరించారని వాపోయాడు. మరుసటి రోజు సాయం కోసం వారిని సంప్రదించగా, కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించారని ఈ ఏడాది జనవరి 23న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ ఘటనపై మొదట ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని బాధితుడు తెలిపాడు. చివరకు ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం, షాగంజ్ పోలీసులు నిర్వాహకుడు రామ్‌సనేహీ సింగ్, నటుడు నైతిక్ పాండేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


More Telugu News