బడ్జెట్‌లో విదేశీ సాయం కింద బంగ్లాదేశ్‌కు కేటాయింపులు తగ్గించిన భారత్

  • విదేశీ సాయం కింద బంగ్లాదేశ్‌కు కేటాయించే నిధులను సగానికి తగ్గించిన భారత్
  • గత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లుగా ఉన్న కేటాయింపును ఈసారి రూ.60 కోట్లకు కుదించిన వైనం
  • బడ్జెట్‌లో భూటాన్‌కు అత్యధికంగా రూ.2,288 కోట్ల ఆర్థిక సాయం కేటాయింపులు
విదేశీ సాయం కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌ 2026 - 27లో విదేశీ సాయం కింద బంగ్లాదేశ్‌కు కేటాయించే నిధులను సగానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లుగా ఉన్న కేటాయింపును ఈసారి రూ.60 కోట్లకు కుదించింది. అదే సమయంలో ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు ఈ ఏడాది ఎలాంటి నిధుల కేటాయింపులు చేయలేదు. 

న్యూఢిల్లీ - ఢాకా మధ్య సంబంధాలు కొంతకాలంగా ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలను బంగ్లాదేశ్‌ పాలకులు పట్టించుకోకపోవడంతో, విదేశీ సాయం కేటాయింపుల్లో కోత విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఈసారి బడ్జెట్‌లో భూటాన్‌కు అత్యధికంగా రూ.2,288 కోట్ల ఆర్థిక సాయం కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే ఆరు శాతం ఎక్కువ. నేపాల్‌కు రూ.800 కోట్లు, శ్రీలంకకు రూ.400 కోట్లు, మయన్మార్‌కు రూ.300 కోట్లు కేటాయించారు. మాల్దీవులు, మారిషస్‌కు చెరో రూ.550 కోట్లు, అఫ్గానిస్థాన్‌కు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.25 కోట్లు, ఆఫ్రికన్‌ దేశాలకు రూ.225 కోట్లు, సీషెల్స్‌కు రూ.19 కోట్ల సాయాన్ని కేంద్రం కేటాయించింది.


More Telugu News