ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అల్కరాజ్... చారిత్రక కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన కార్లోస్ అల్కరాజ్
  • ఫైనల్‌లో నొవాక్ జకోవిచ్‌ను ఓడించి చారిత్రక విజయం
  • అత్యంత పిన్న వయసులో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు
  • మెల్‌బోర్న్ ఫైనల్స్‌లో జొకోవిచ్‌కు ఇదే తొలి ఓటమి
టెన్నిస్ ప్రపంచంలో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నొవాక్ జకోవిచ్‌ను ఓడించి తన తొలి  ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో, ఓపెన్ శకంలో అత్యంత పిన్న వయసులో కెరీర్ గ్రాండ్‌స్లామ్ (నాలుగు మేజర్ టైటిళ్లు) పూర్తి చేసిన ఆటగాడిగా అల్కరాజ్ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో జొకోవిచ్‌పై గెలుపొందాడు. తొలి సెట్‌లో తడబడినప్పటికీ, 22 ఏళ్ల అల్కరాజ్ అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో జకోవిచ్‌కు తన 11 ఫైనల్స్‌లో తొలి ఓటమి ఎదురైంది. దాదాపు మూడు గంటల రెండు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ టెన్నిస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ విజయంతో అల్కరాజ్ తన కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రెడ్ పెర్రీ, రోజర్ ఫెదరర్, రఫెల్ నడాల్, జకోవిచ్ వంటి దిగ్గజాల సరసన కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనుకున్న 38 ఏళ్ల జకోవిచ్ నిరీక్షణ మరికొంత కాలం కొనసాగనుంది.


More Telugu News