Jogi Ramesh: మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో... నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం!: జోగి రమేశ్

Jogi Ramesh Warns Opponents After Attack on His House
  • మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి
  • లోకేశ్ పై వ్యాఖ్యల నేపథ్యంలో రాళ్లు, పెట్రోల్ బాంబుల వినియోగం!
  • తీవ్రంగా స్పందించిన జోగి రమేశ్ 
  • ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడిచేశారంటూ ఆగ్రహం
  • అధికారంలో ఎప్పుడూ మీరే ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు
"ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు? నా ఇంటిపైకి గంజాయి బ్యాచ్‌ను పంపి పెట్రోల్ బాంబులు వేయిస్తారా?" అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం" అని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు. తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. "ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో. నీ పిల్ల చేష్టలు, క్షణికానందం మానుకో" అని జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. నన్ను ఏం చేయాలనుకున్నారో ఏమో... నన్ను మట్టుబెట్టాలనుకున్నారా... రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులతో నా ఇంటిపై దాడి చేశారు అని వెల్లడించారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలో రాళ్లు రువ్వడంతో పాటు పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటికి పాక్షికంగా నిప్పు అంటుకుంది. ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేశ్ తండ్రి, భార్య, కుమారుడు కూడా నివాసంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
Jogi Ramesh
Nara Lokesh
YSRCP
TDP
Andhra Pradesh Politics
Ibrahimpatnam
Krishna District
Political Attack
Petrol Bomb
Telugu Desam Party

More Telugu News