Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!

Chandrababu Naidu Focuses on Kuppam After Taking Office
షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కుప్పంలో ఆదివారం నాడు నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను వెతుక్కుని వచ్చి గౌరవిస్తానని భరోసా ఇస్తూనే, పనితీరు మార్చుకోని నేతలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఇదే సమావేశంలో, నాడు నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి ఉన్నత పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. "ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకున్నా పార్టీ జెండా మోసిన షణ్ముఖ రెడ్డికి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమే ఇందుకు నిదర్శనం. నిన్నటి వరకు సామాన్య కార్యకర్తగా ఉన్న ఆయన, ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడయ్యారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండే గుర్తింపు" అని పేర్కొన్నారు. తన కష్టాన్ని గుర్తించినందుకు షణ్ముఖ రెడ్డి భావోద్వేగానికి గురై అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్ని సంక్షోభాలు ఎదురైనా టీడీపీ నిలదొక్కుకోగలిగిందని, అందుకే ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతటి మెజారిటీని కూటమికి కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందని, ప్రజలతో మమేకమైతేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. "నా రాజకీయ జీవితం 2028 నాటికి 50 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రజల భవిష్యత్, వారి సంక్షేమం కోసమే నా ప్రతి ఆలోచన ఉంటుంది" అని తెలిపారు.

కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడుతూ, ఒకే సీజన్‌లో హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చామని, లేదంటే ఈ ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనేదని గుర్తుచేశారు. "రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పాం.. చేసి చూపించాం. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమ అగ్రస్థానంలో ఉంది. దీనిని మరింత అభివృద్ధి చేస్తాం" అని హామీ ఇచ్చారు. అమరావతి వంటి నగరాలు దేశానికి అవసరమని ఆర్థిక సర్వే కూడా చెప్పిందని గుర్తుచేశారు.

తన పాలనా శైలిని వివరిస్తూ, "నేను నిర్మొహమాటంగా మాట్లాడతా, వాస్తవాలు చెబుతా. తప్పులు సరిచేసుకోమని సూచిస్తా. అప్పటికీ పనితీరు మార్చుకోకపోతే నమస్కారం పెట్టి పక్కన పెడతాను" అని గట్టిగా హెచ్చరించారు. ప్రతి వారం ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తున్నానని, కార్యకర్తలకు, తనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలని, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కుప్పంలోని 150 చెరువులను నింపినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని కోరారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Kuppam
Andhra Pradesh
TDP
Nara Lokesh
Yuvagalam Padayatra
Rayalaseema
Krishna River
Politics
AP Elections 2024

More Telugu News