Nirmala Sitharaman: పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman Presents Budget on Magha Purnima
  • 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగుతోందన్న నిర్మలా సీతారామన్
  • అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామన్న ఆర్థిక మంత్రి
  • ప్రజల ఆశలను చేరుకోవడమే లక్ష్యమని వ్యాఖ్య
  • యువశక్తి బడ్జెట్‌గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెడుతున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది తొమ్మిదవసారి కావడం గమనార్హం.

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగుతోందని, వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నందుకు వారికి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు చెప్పారు.

ప్రజల ఆశలను చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. భారత ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపడుతున్నామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అనిశ్చితి పరిస్థితుల్లోనూ మనం ముందుకు సాగుతున్నామని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థలో మంచి నిలకడ వచ్చిందని అన్నారు.

ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నామని తెలిపారు. రైతులు, గిరిజనులు, దళితులకు అభివృద్ధి ఫలాలు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను యువశక్తి బడ్జెట్‌గా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. తమది సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆధారిత బడ్జెట్ అన్నారు. నైపుణ్యం, ఉత్పాదక, పోటీతత్వంతో భారత్‌ను ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకు వెళుతున్నామని పేర్కొన్నారు. మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తుందని అన్నారు.

అంతకుముందు, తన బృందంతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన నిర్మలా సీతారామన్ బడ్జెట్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి మిఠాయి తినిపించారు. అనంతరం పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరగంట ముందే పార్లమెంటుకు చేరుకున్నారు.
Nirmala Sitharaman
Budget 2024
Union Budget
Indian Economy
Viksit Bharat
Magha Purnima

More Telugu News