జీతం రూ.12 లక్షల లోపు ఉన్నా సరే..స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు ట్యాక్స్ కట్టాల్సిందే..!

  • వేతన జీవులకు రూ.12 లక్షల లోపు ఆదాయానికి నో ట్యాక్స్
  • దీర్ఘకాలిక పెట్టుబడుల ఆదాయం 3 లక్షలు దాటితే మాత్రం 12.5 శాతం పన్ను
  • సెక్షన్ 87ఏ మేరకు మినహాయింపు వర్తించదంటున్న నిపుణులు
వేతన జీవులకు పన్ను భారం తగ్గించే ఉద్దేశంతో ఆదాయ పరిమితిని కేంద్రం రూ.12 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఓ ప్రత్యేక సందర్భంలో మాత్రం ఈ పరిమితికన్న ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఉద్యోగి ఏడాదికి రూ.12.75 లక్షలు సంపాదిస్తే.. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు మినహాయింపు తర్వాత రూ.12 లక్షలపై పన్ను రూ.60 వేలు.. అయితే, ఆదాయ పన్ను సెక్షన్ 87ఏ ప్రకారం ఈ మొత్తానికీ మినహాయింపు వర్తిస్తుంది. దీంతో సదరు ఉద్యోగిపై ఎలాంటి పన్ను భారం పడదని డెలాయిటీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా మాథూర్ తెలిపారు.

ఈక్విటీలపై రాబడికి ఈ 87ఏ సెక్షన్ వర్తించదని మాధుర్ వివరించారు. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఏడాదికి రూ.1.25 లక్షలు ఆర్జిస్తే.. ఆ మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉద్యోగి మొత్తం ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నప్పటికీ అందులో ఈక్విటీల ద్వారా పొందిన ఆదాయం రూ.1.25 లక్షల కంటే ఎక్కువైతే పన్ను భారం తప్పదని చెప్పారు.

ఉదాహరణకు ఓ ఉద్యోగి మొత్తం ఆదాయం రూ.11 లక్షలు (జీతం రూ.9.75 లక్షలు, ఈక్విటీ రూ.1.25 లక్షలు) అయితే.. ఈక్విటీల ద్వారా వచ్చిన ఆదాయం పరిమితికి లోబడి ఉండడం వల్ల ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.

మరొక సందర్భంలో.. ఉద్యోగి ఆదాయం రూ.11 లక్షలు (జీతం రూ.8 లక్షలు, ఈక్విటీ రూ.3 లక్షలు) అయితే మాత్రం.. ఈక్విటీలో రూ.1.25 లక్షలు పోగా మిగిలిన రూ.1.75 లక్షలపై రూ.12.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈక్విటీల ద్వారా పొందిన ఆదాయం పరిమితి (రూ.1.25 లక్షలు) కి మించడమే దీనికి కారణమని మాథూర్ వివరించారు. 

ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టినందుకు మధ్యతరగతిని శిక్షిస్తున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ, ఆ అభిప్రాయం సరైంది కాదన్నారు. "ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రేట్లు రెండు పన్ను విధానాల్లోనూ ఒకేలా ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి రిబేట్ వర్తిస్తుంది, కానీ ఈక్విటీ లాభాలకు వర్తించదు. అయినప్పటికీ, రూ.1.25 లక్షలు దాటిన లాభాలపై మాత్రమే 12.5 శాతం ప్రత్యేక రేటుతో పన్ను విధిస్తున్నందున, ఈక్విటీలపై కఠినంగా పన్ను వేస్తున్నారని చెప్పడం సరికాదు" అని మాథుర్ విశ్లేషించారు.




More Telugu News