మ్యాగీ అమ్మకం ద్వారా ఒక్కరోజులో 21 వేల సంపాదన.. వీడియో ఇదిగో!

  • హిమాచల్ ప్రదేశ్ లోని ఓ కొండపైన టూరిస్టులకు మ్యాగీ అమ్మిన యువకుడు
  • కంటెంట్ క్రియేటర్ ప్రయోగం.. వైరల్ గా మారిన వీడియో
  • ఒక్కోటీ రూ.70 చొప్పున 300 లకు పైగా ప్లేట్లు అమ్మినట్లు వెల్లడి
పర్యాటక ప్రాంతాల్లో ఆహార పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. కాస్త కష్టపడితే టూరిస్టులకు ఆహారం అందించడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందవచ్చని ఓ కంటెంట్ క్రియేటర్ ప్రయోగాత్మకంగా చేసి చూపించాడు. పర్యాటకులకు మ్యాగీ అమ్ముతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక్కరోజులో తాను రూ.21 వేలు సంపాదించానని అందులో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

బాదల్ ఠాకూర్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ కొండ ప్రాంతంలో చిన్న మ్యాగీ స్టాల్ పెట్టాడు. అక్కడికి వచ్చిన పర్యాటకులకు ప్లేట్ రూ.70 చొప్పున, చీజ్ మ్యాగీ రూ.100 చొప్పున అమ్మాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు. దీని ద్వారా రూ.21 వేలు వచ్చాయని బాదల్ తెలిపాడు. చల్లని కొండప్రాంతం కావడంతో వేడివేడి మ్యాగీ కోసం పర్యాటకులు ఎగబడతారని నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.

రోజుకు రూ.21 వేల చొప్పున నెలకు లక్షల్లో సంపాదించవచ్చని, తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి మ్యాగీ స్టోర్ పెట్టుకుంటామని సరదాగా కామెంట్ చేస్తున్నారు. మొత్తం ఆదాయంలో ఖర్చులు అన్నీ పోను మిగిలేది తక్కువేనని మరికొందరు అంటున్నారు. మ్యాగీ ప్యాకెట్లు, గ్యాస్ సిలిండర్, నీరు, ప్లేట్ల ఖర్చుతో పాటు వాటిని కొండపైకి చేర్చేందుకు కొంత ఖర్చు చేయాల్సిందేనని గుర్తుచేస్తున్నారు.

పైగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో రోజంతా నిలబడి పనిచేయాలని గుర్తుచేశారు. ఇక మ్యాగీ చేయడానికి సహాయం చేసిన అసిస్టెంట్లకు కొంత ఇవ్వాలని.. ఈ ఖర్చులన్నీ పోగా సుమారు రూ. 8 వేల వరకు మిగలవచ్చని ఓ నెటిజన్ చెప్పారు.


More Telugu News