ఐశ్వర్య రాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా?

  • ఐశ్వర్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన నిర్మాత శైలేంద్ర సింగ్
  • తొలి మూడు యాడ్స్ ను రూ. 5 వేలకే చేసిందని వెల్లడి
  • ఆమె వినయం ఆమె కెరీర్ కు అద్భుతమైన పునాది వేసిందన్న శైలేంద్ర
భారతీయ చలనచిత్ర రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ ఒకరు. ఎన్నో ఏళ్ల పాటు ఆమె బాలీవుడ్ లో అగ్ర తారగా కొనసాగారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఐశ్వర్య ప్రయాణం మాత్రం చాలా సాధారణంగా మొదలయింది. 

ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ ఐశ్వర్య కెరీర్ తొలి రోజుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పటికి ఐశ్వర్య వయసు 18 లేదా 19 ఉంటుందని... తన తల్లిదండ్రులతో కలిసి మెరైన్ డ్రైవ్ లో తమను కలవడానికి రాత్రి 8.30 గంటల సమయంలో వచ్చిందని ఆయన తెలిపారు. తమ మొదటి మూడు ప్రకటనలను ఆమె కేవలం రూ. 5 వేల రూపాయలకే చేసిందని చెప్పారు.

ఐశ్వర్య తొలి యాడ్ ను ముకేశ్ మిల్స్ లో చిత్రీకరించారని, కలబంద హెయిర్ ఆయిల్ కు ఐశ్వర్య మరో యాడ్ చేసిందని, అర్జున్ రాంపాల్ తో కలిసి మరో యాడ్ లో నటించిందని శైలేంద్ర సింగ్ తెలిపారు. ఐశ్వర్య ఎంతో వినయంగా ఉండేదని... అదే ఆమె కెరీర్ కు అద్భుతమైన పునాది వేసిందని చెప్పారు.  

1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్య... అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె... వెనుదిరిగి చూసుకోలేదు. అందంతో పాటు, మంచి నటనతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య... ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.


More Telugu News