భాష కూడా ప్రేమ లాంటిదే: హిందీపై కమల్ హాసన్ వ్యాఖ్యలు

  • హిందీ బలవంతంపై మరోసారి స్పందించిన కమల్ హాసన్
  • భాషా ప్రేమ విషపూరితం కాకూడదని వ్యాఖ్య
  • ఏ భాషనైనా నేర్చుకునే ఎంపిక ప్రజలకే వదిలేయాలన్న కమల్
  • 27 ఏళ్ల వయసులో హిందీ నేర్చుకున్నానని వెల్లడి
హిందీ భాషను బలవంతంగా రుద్దడంపై జరుగుతున్న వివాదంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. భాష పట్ల ప్రేమ ఉండాలి కానీ అది విషపూరితంగా (టాక్సిక్) మారకూడదని, ఏ భాషనూ ఎవరిపైనా బలవంతంగా రుద్దరాదని ఆయన అన్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఎన్డీటీవీ తమిళనాడు సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి. నా భాష నా సాంస్కృతిక గర్వం. నా భాషను ప్రేమించడానికి నేను మరో భాషను ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇతరులు నా భాషను ప్రేమించాలంటే నేను వారి భాషను గౌరవించాలి. కానీ దాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఏది నేర్చుకోవాలో నిర్ణయించుకునే ఎంపిక ప్రజలకే వదిలేయాలి.. భాష కూడా ప్రేమ లాంటిదే" అని కమల్ హాసన్ వివరించారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని, హిందీని బలవంతంగా రుద్దుతోందని కమల్ హాసన్ గత వారం తన పార్టీ సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ ప్రస్తుతం డీఎంకే కూటమిలో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, "నేను 27 ఏళ్ల వయసులో హిందీ నేర్చుకున్నాను. ఎవరూ నాపై బలవంతం చేయలేదు. నా స్నేహితులు నన్ను ఆటపట్టిస్తూ తిట్టడం ద్వారానే మొదటి హిందీ పదాలు నేర్చుకున్నాను. ఆ రోజు హిందీ నేర్చుకోవడం అనేది నా ఇష్ట ప్రకారం జరిగింది" అని గుర్తుచేసుకున్నారు. భాష కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, అది తన భావోద్వేగం, వ్యక్తీకరణ అని కమల్ పేర్కొన్నారు.


More Telugu News