ఐటీ సోదాలు జరుగుతుండగా... తుపాకీతో కాల్చుకుని బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య

  • కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సీజే రాయ్ ఆత్మహత్య
  • ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో కార్యాలయంలోనే ఘటన
  • తుపాకితో తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వైనం
  • ఐటీ దాడుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రాథమిక సమాచారం
  • రియల్ ఎస్టేట్ రంగంలోనే కాక, సినీ నిర్మాతగానూ ఆయన ప్రసిద్ధి
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సీజే రాయ్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన కార్యాలయంలో శుక్రవారం తుపాకితో కాల్చుకుని ఆయన ప్రాణాలు విడిచారు. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆయన సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

గత రెండు, మూడు రోజులుగా కాన్ఫిడెంట్ గ్రూప్‌కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వరుస దాడులతో సీజే రాయ్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని తన ఆఫీసులో తలపై తుపాకితో కాల్చుకున్నారు. సిబ్బంది వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ తనను తాను కాల్చుకున్నారు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గత 2-3 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు, వారికి సమాచారం అందించాం" అని తెలిపారు.

కేరళలోని కొచ్చికి చెందిన సీజే రాయ్, కాన్ఫిడెంట్ గ్రూప్‌ను స్థాపించి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, కేరళలో అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టారు. వ్యాపారవేత్తగానే కాకుండా, ఆయన మలయాళంలో సినీ నిర్మాతగానూ సుపరిచితులు. మోహన్‌లాల్ హీరోగా నటించిన 'కాసనోవా' చిత్రాన్ని నిర్మించారు. ఆశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.




More Telugu News