నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు రావు: పవన్ కల్యాణ్

  • పనిలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న పవన్
  • గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను పూర్తిగా నాశనం చేసిందని విమర్శలు
  • వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టీకరణ
 "నా వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు గానీ, సిఫార్సులు గానీ ఉండవు. కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు... ప్రతి అధికారి నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలి" అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. పనిలో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇంకా పాత నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ పాలసీల అమలులో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

ప్రజల సంతోషం, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆశయాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు చిత్తశుద్ధితో, జవాబుదారీతనంతో వ్యవహరించాలని పవన్ కల్యాణ్ కోరారు. శుక్రవారం నాడు విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం, పల్లెపండగ 1.0, 2.0, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల పురోగతిపై ఆరా తీశారు. లక్ష్యాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారనే దానిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, "కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో ఉంది. నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలి" అని అన్నారు.

గత ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసి, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను నీరుగార్చి, రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. పనులు చేసినట్టు రికార్డులు సృష్టించారు గానీ, ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవు" అని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, వ్యవస్థలను బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 10 వేల ప్రమోషన్లను ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పూర్తి చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని పవన్ గుర్తుచేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఎంపీడీవోపై దాడి జరిగితే స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చామని, ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నామని, కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నామని, తమ కష్టానికి సార్థకత చేకూరేలా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, విశాఖపట్నం కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున, వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.




More Telugu News