ఎన్ఎస్ఈ ఐపీఓకు ఎట్టకేలకు సెబీ గ్రీన్ సిగ్నల్

  • ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు మార్గం సుగమం
  • దశాబ్ద కాలంగా నిలిచిన ప్రతిపాదనకు సెబీ ఆమోదం
  • గవర్నెన్స్, కో-లొకేషన్ కేసుల కారణంగా ఇన్నాళ్లు జాప్యం
  • మార్చి చివరికల్లా ముసాయిదా పత్రాలు దాఖలు చేసే అవకాశం
  • సెబీ నిర్ణయంతో వాటాదారుల్లో హర్షం
భారత క్యాపిటల్ మార్కెట్లలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి ఆమోదం పొందినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దశాబ్దానికి పైగా నిరీక్షణకు ఈ ప్రకటనతో తెరపడింది. పాలనాపరమైన లోపాలు, తీవ్ర వివాదాస్పదమైన కో-లొకేషన్ కేసు వంటి పలు కారణాలతో ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రణాళికలు ఏళ్లుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

తాజాగా సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో, ఐపీఓ స్వరూపం, సమయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఎన్ఎస్ఈ యాజమాన్యం సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం, ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఐపీఓ కోసం అవసరమైన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సెబీకి సమర్పించాలని ఎన్ఎస్ఈ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు, న్యాయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. డ్రాఫ్ట్ పత్రాలకు సెబీ నుంచి తుది ఆమోదం లభించిన తర్వాతే ఐపీఓ ప్రక్రియ ముందుకు సాగుతుంది.

ఈ కీలక పరిణామంపై ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి హర్షం వ్యక్తం చేశారు. "మా వృద్ధి ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి. సెబీ ఆమోదం లభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనితో మా వాటాదారులందరికీ విలువను సృష్టించే ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్ఎస్ఈ ఒక విడదీయరాని భాగమని, దేశ క్యాపిటల్ మార్కెట్లకు ఒక దిక్సూచి అనే విశ్వాసాన్ని ఈ ఆమోదం మరింత బలపరుస్తుంది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఎక్స్ఛేంజ్, దాని సభ్యులు, వాటాదారులు, దేశ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, ఎన్ఎస్ఈ ఐపీఓకు ఈ నెలలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే గతంలోనే సంకేతాలు ఇచ్చారు.

భారత్‌లో అత్యధికంగా వాటాలు కలిగిన అన్‌లిస్టెడ్ కంపెనీగా ఎన్ఎస్ఈకి పేరుంది. ఈ నేపథ్యంలో, ఈ ఐపీఓ భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




More Telugu News