హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

  • హిందువుల ప్రాణాలతో చెలగాటమాడేందుకే ఈ కుట్ర అని సంచలన ఆరోపణ
  • వైసీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని వెల్లడి
  • రూ.250 కోట్ల అవినీతి జరిగిందని, నెయ్యిలో జంతు కొవ్వు కూడా ఉందని వ్యాఖ్య
  • జగన్, వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ప్రాణాంతక రసాయనాలు కలిపారని, హిందువుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే ఈ కుట్రకు పాల్పడిందని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు) సంచలన ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దాఖలు చేసిన ఫైనల్ చార్జ్‌షీట్‌తో ఈ బండారం బట్టబయలైందని, ఇది స్లో పాయిజన్ ఇచ్చి హిందువులను హతమార్చే ప్రయత్నమేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేసి మహాపాపానికి ఒడిగట్టిన వైఎస్ జగన్, వైసీపీ నేతలు హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిట్ నివేదికలో తమకు క్లీన్‌చిట్ వచ్చిందని వైసీపీ నేతలు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవానికి, 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా అయిన సుమారు 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ అని సిట్ చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఈ రూ.250 కోట్ల విలువైన కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని, కోట్ల మంది హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ అనే సంస్థకు కనీస పాల సేకరణ సామర్థ్యం లేకపోయినా, కేవలం ఒకరిద్దరికి లబ్ధి చేకూర్చేందుకే నిబంధనలు మార్చి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.

"చుక్క పాలు లేకుండా లక్షల కిలోల నెయ్యి ఎలా వస్తుంది? పామాయిల్, ప్రాణాంతక రసాయనాలు, జంతు కొవ్వు (టాలో) కలిపి సింథటిక్ నెయ్యి తయారు చేసి శ్రీవారి ప్రసాదంలో వాడారు. ఎన్‌డీడీబీ (NDDB) నివేదికతో పాటు సిట్ రిపోర్ట్‌లోనూ నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా ఉంది. ఇది హిందువులపై జరిగిన దాడి కాదా?" అని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. ఈ కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని, అన్యమతస్థులు తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించగా, గత పాలకులు వారికి సహకరించారని ఆరోపించారు.

ఈ కేసులో గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు సీబీఐకి ఇవ్వడానికి నిరాకరించారని, కానీ ఆయన పీఏ చిన్నప్ప ఖాతాలోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని నిలదీశారు. గత పాలకుల ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్ వద్ద ఆధారాలుగా ఉన్నాయని చెప్పారు. తిరుమలలో జరిగిన ఈ అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని, తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే పాపాలు పోవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కల్తీ నెయ్యిలోని రసాయనాలపై పూర్తి నిజాలు తేలేందుకు మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయించాలని సిట్‌ను, న్యాయస్థానాన్ని కోరతామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ మహా కుంభకోణం వెలుగులోకి వచ్చిందని, టీటీడీ పవిత్రతను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.




More Telugu News