పిల్లలకు సోషల్ మీడియా కట్టడి ఆలోచనలో కర్ణాటక సర్కారు

  • పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించే అంశంపై కర్ణాటక ప్రభుత్వం చర్చ
  • ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి ప్రియాంక్ ఖర్గే
  • మైనర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావంపై బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన
  • ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల తరహాలో చర్యలు తీసుకునే యోచన
పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే అంశంపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు శుక్రవారం శాసనసభలో ఆయన వెల్లడించారు. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్. సురేశ్ కుమార్ ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేయగా, మంత్రి స్పందించారు.

ఈ విషయం చాలా తీవ్రమైనదని, ఇప్పటికే ఫిన్‌లాండ్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ప్రియాంక్ ఖర్గే గుర్తుచేశారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై మేం చర్చిస్తున్నాం. ఈ అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది" అని ఆయన తెలిపారు. ఇప్పటికే మెటా సంస్థ సహకారంతో రాష్ట్రంలో 'డిజిటల్ డిటాక్స్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు, లక్ష మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని వివరించారు.

అంతకుముందు సభలో మాట్లాడిన సురేశ్ కుమార్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను ఆస్ట్రేలియా నిషేధించిందని ప్రస్తావించారు. "పిల్లలు యుక్తవయస్కులు కాకముందే అశ్లీల కంటెంట్‌కు బానిసలవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వెంటనే చర్యలు తీసుకోకపోతే మన పాఠశాలలు, కుటుంబ వ్యవస్థలు నాశనమవుతాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.




More Telugu News