కుటుంబాన్ని మధ్యలోకి లాగొద్దు.. ఎలాన్ మస్క్‌పై వినోద్ ఖోస్లా ఫైర్

  • ఎలాన్ మస్క్‌పై మరోసారి విరుచుకుపడ్డ వినోద్ ఖోస్లా
  • జాతివివక్ష వ్యాఖ్యలు చేసి కుటుంబాన్ని అడ్డుపెట్టుకోవద్దని హితవు
  • 'వైట్ అమెరికా గ్రేట్ ఎగైన్'కు మద్దతిస్తున్నారని ఖోస్లా ఆరోపణ
  • భారత సంతతి భాగస్వామి గురించి ప్రస్తావిస్తూ మస్క్ కౌంటర్
  • ఇద్దరు టెక్ బిలియనీర్ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
భారత సంతతికి చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. జాతి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేస్తూ, తనను తాను సమర్థించుకోవడానికి కుటుంబాన్ని మధ్యలోకి లాగడంపై ఖోస్లా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా మస్క్‌కు చురకలు అంటించారు.

"ప్రపంచ జనాభాలో శ్వేతజాతీయులు వేగంగా అంతరించిపోతున్న మైనారిటీ" అంటూ మస్క్ గతంలో చేసిన ఓ పోస్ట్‌తో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ఖోస్లా.. మస్క్ జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నారని, 'వైట్ అమెరికా గ్రేట్ ఎగైన్' (WAGA)కు మద్దతిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్.. ఖోస్లాను 'గర్విష్టి', 'రిటార్డ్' అంటూ దూషించారు. తన భాగస్వామి శివాన్ జిలిస్ సగం భారతీయురాలని, వారి కుమారుడికి భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ పేరు పెట్టానని చెబుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం ఖోస్లా మరోసారి స్పందించారు. "మీ కుటుంబాన్ని ఇందులో కలపడానికి బదులు, మ‌రోసారి జాతి వివక్షగా అనిపించే పోస్టులు పెట్టకుండా ప్రయత్నించండి. మీరు అమెరికాలో శ్వేతజాతి సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నించడం లేదని, 'వైట్ అమెరికా గ్రేట్ ఎగైన్'కు మద్దతుదారు కాదని అంగీకరిస్తే చాలామంది అభినందిస్తారు" అని ఖోస్లా పేర్కొన్నారు.

మస్క్ ప్రస్తావించిన బీచ్ వివాదంపై కూడా ఖోస్లా స్పందించారు. తన కాలిఫోర్నియా ఆస్తి సమీపంలోని బీచ్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ ప్రాపర్టీ గుండా ప్రవేశించాలంటే రుసుము చెల్లించాల్సిందేనని అన్ని కోర్టులు తీర్పు ఇచ్చాయని గుర్తుచేశారు. "ప్రైవేట్ ఆస్తి హక్కు అనే సూత్రాన్ని కాపాడటానికి నేను నిలబడటాన్ని మీరు అభినందించాలి. ఇది కాకపోతే మిగతాదంతా కమ్యూనిజమే" అని వ్యాఖ్యానించారు.


More Telugu News