బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ధురంధర్'.. ఇప్పుడు ఓటీటీలో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ధురంధర్'
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్
  • రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణం
  • హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన చిత్రం
  • భారత్-పాక్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. థియేటర్లలో భారీ విజయం తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన 'ధురంధర్', ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. విడుదలై రెండు నెలలు దాటినా కొన్ని థియేటర్లలో ఇంకా ప్రదర్శితమవుతుండటం ఈ సినిమాకు ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ చిత్రంతో సారా అర్జున్ బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

ఇక మూవీ కథ విషయానికొస్తే, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భారత నిఘా వర్గాలు అత్యంత రహస్యంగా చేపట్టే ఒక మిషన్ చుట్టూ కథనం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. యాక్షన్, దేశభక్తి, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించి దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కుటుంబంతో కలిసి చూసేలా తెర‌కెక్కించారు. మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, కథనం నెమ్మదించకుండా వేగంగా సాగడం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


More Telugu News