ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో గెలిచేదెవరు?

  • బెంగాల్‌లో 'దీదీ' హవా.. పుంజుకుంటున్న బీజేపీ
  • నేడు లోక్‌సభ ఎన్నికలు జరిగినా టీఎంసీ తన పట్టును నిలబెట్టుకుంటుందన్న సర్వే
  • గత ఆగస్టు సర్వేతో పోలిస్తే బీజేపీ తన స్థానాలను 11 నుంచి 14కి పెంచుకునే అవకాశం
  • రాష్ట్రంలో సున్నాకి పడిపోనున్న కాంగ్రెస్ ప్రాతినిధ్యం
  • 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తికర అంశాలు 
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉన్న తరుణంలో.. రాష్ట్ర ఓటర్ల నాడిని 'ఇండియా టుడే - సి ఓటర్' సర్వే ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ఫలితాలను (29 సీట్లు) దాదాపుగా పునరావృతం చేస్తూ.. ఈసారి టీఎంసీ 28 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది.

గత ఏడాది ఆగస్టులో జరిగిన సర్వేలో బీజేపీకి కేవలం 11 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. తాజా జనవరి 2026 సర్వేలో ఆ సంఖ్య 14కు పెరిగింది. ఎన్డీయే ఓటు షేర్ కూడా 39 శాతం నుంచి 42 శాతానికి పెరగడం గమనార్హం. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అంటే క్రమంగా కమలం పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది.

మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వే నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఏకైక సీటును కూడా కోల్పోయే అవకాశం ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమేనని సర్వే పేర్కొంది.

 సి-ఓటర్ వ్యవస్థాపక డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అభిప్రాయం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు తీవ్రంగా పోలరైజేషన్ అయ్యాయి. ఓటర్లు స్పష్టంగా అధికార టీఎంసీ లేదా ప్రతిపక్ష బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ గణాంకాలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండగా.. టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో సఫలీకృతమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ప్రభావం బలంగా ఉండటంతో ఎన్డీయే కూటమికి 352 స్థానాలు లభిస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. బెంగాల్‌లో టీఎంసీ సీట్లు ఆగస్టు అంచనా (31) కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా మమతా బెనర్జీ ఇమేజ్ చెక్కుచెదరకుండా ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.


More Telugu News