ఆ నిర్ణయం భేష్: పోలీసులపై జగ్గారెడ్డి ప్రశంస

  • ప్రత్యేక నేరాల్లో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్న జగ్గారెడ్డి
  • కొంతమంది మహిళలను ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం
  • గతంలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయన్న జగ్గారెడ్డి
కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని కేసుల్లో ఫిర్యాదు లేకుండానే బాధితుల ఇళ్లకు వెళ్లి కేసు నమోదు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బాధితుల ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ వంటి నిర్ణయాలు మంచిదే అన్నారు.

కొంతమంది సైకోగాళ్లు మహిళలను ట్రాప్ చేసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతులను, మహిళలను వేధించే వారికి, బ్లాక్‌మెయిల్ చేసే వారికి సజ్జనార్ వంటి అధికారులే సరైనవారు అన్నారు. ఇలాంటి అంశాల్లో సమాజంలో ఎన్‌కౌంటర్ వంటి భయాలు కూడా ఉండాలని వ్యాఖ్యానించారు.

అమ్మాయిలను వేధించినందుకు గతంలో కాంగ్రెస్ హయాంలో ఒకటి, బీఆర్ఎస్ హయాంలో మరో ఎన్‌కౌంటర్ జరిగిందని గుర్తు చేశారు. రాజ్యాంగపరంగా ఎన్‌‍కౌంటర్లను సమర్థించలేమని, కానీ ఆడబిడ్డల తండ్రిగా, కుటుంబాలు కలిగిన వారిగా సమర్థిస్తామని అన్నారు. బాధిత మహిళలకు భరోసా ఇచ్చేలా పోలీసుల చర్యలు ఉండాలని వ్యాఖ్యానించారు.

కొంతమంది ఆడపిల్లల ఫొటోలు తీసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు ఇచ్చే ఫిర్యాదులను బహిర్గతం చేయకపోవడమే మంచిదని జగ్గారెడ్డి అన్నారు. సున్నితమైన అంశాల్లో మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు ప్రచురించడం సరికాదని అన్నారు. ఒకరి వ్యక్తిగత అంశాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు.


More Telugu News