తిరుమల లడ్డూను రసాయనాలతో తయారు చేశారు: సత్యకుమార్

  • లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందన్న సత్యకుమార్
  • అవినీతిపరులను జైలుకి పంపితే రెడ్ బుక్ అంటున్నారని మండిపాటు
  • జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు
గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారని విమర్శించారు. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం 'జగన్ అండ్ కో'దే అని అన్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రసాయనాలను ఉపయోగించి లడ్డూ తయారు చేశారని మండిపడ్డారు. రూ. 250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతిపరులను జైలుకి పంపితే దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలా అంటారని ప్రశ్నించారు.  

రప్పా రప్పా అనేవాళ్లని, తప్పు చేసిన వాళ్లని వదిలేయాలి అనేలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యక్తిగత విషయాలను కూడా కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోందని అన్నారు. సొంత ఖజానాను నింపుకోవడం కోసం నాణ్యత లేని మద్యం అమ్మి, ప్రజల ప్రాణాలు తీయడం జగన్ కు తప్పుగా అనిపించలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా... అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణి మరణిస్తే... ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మరణించినట్టు ప్రచారం చేస్తున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేశామని చెప్పారు. విజిటర్ పొలిటీషియన్ మాదిరి జగన్ వారానికి ఒకరోజు ఏపీకి వచ్చిపోతున్నాడని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే అసెంబ్లీకి రావాలని అన్నారు. జగన్... మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి... లేకపోతే మీ రాజకీయ సమాధిని మీరే కట్టుకున్నట్టవుతుందని చెప్పారు.


More Telugu News