జగన్‌కు అధికారం సూట్ కాలేదు: షర్మిల

  • 2027లో జగన్ పాదయాత్ర చేస్తుండడంపై షర్మిల స్పందన
  • ఈ యాత్ర ప్రజల కోసం కాదు అధికారం కోసమేనన్న  ఏపీ కాంగ్రెస్ చీఫ్
  • జగన్‌లో స్వార్థం తగ్గి, ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని హితవు
  • అప్పటివరకు దేవుడు కరుణించడని వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "జగన్‌కు అధికారం సూట్ కాలేదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన అసలు నైజం బయటపడిందని, ఆయన తన స్వభావం మార్చుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2027లో జగన్ చేపట్టనున్న పాదయాత్రపై ఆమె తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

"ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అతడికి అధికారం ఇచ్చి చూడాలని అబ్రహం లింకన్ అన్నారు. మనం జగన్‌కు అధికారం ఇచ్చి చూశాం. అతడి పనితీరు ఎలా ఉందో గమనించాం. జగన్‌కు అధికారం సూట్ కాలేదని అర్థమైంది" అని షర్మిల అన్నారు. జగన్‌లో స్వార్థం తగ్గి, ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని, అప్పటివరకు దేవుడు కరుణించడని, ప్రజలు కూడా ఆదరించరని ఆమె వ్యాఖ్యానించారు.

2027 జూలైలో చేపట్టే పాదయాత్ర గురించి ఇప్పుడే ఎందుకు ప్రకటించాలని షర్మిల ప్రశ్నించారు. "ఆ యాత్ర కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. మేం ఇప్పుడు ఉపాధి హామీ కూలీల కోసం యాత్ర చేస్తున్నాం. జగన్ ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం యాత్ర చేస్తున్నారో చెప్పాలి" అని నిలదీశారు.

గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రజలకు చేసిందేమిటని షర్మిల ప్రశ్నించారు. "మద్యపాన నిషేధం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యంతో ఏరులై పారించి వేల కోట్లు సంపాదించారు. వేల ఏళ్ల నాటి రుషికొండను బోడిగుండు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యకు ఎప్పుడైనా వచ్చారా? కనీసం సొంత పార్టీ నాయకులకైనా అపాయింట్‌మెంట్ ఇచ్చారా? కేవలం ఎన్నికలకు ముందు 'సిద్ధం' సభల పేరుతో హడావుడి చేశారు" అని తీవ్రంగా విమర్శించారు. 

వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, ఇచ్చిన హామీలను ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ మళ్లీ గెలవాలంటే ఆయన తన ప్రవర్తన, నైజం మార్చుకోవడమే ఏకైక మార్గమని షర్మిల స్పష్టం చేశారు.


More Telugu News