Zulkifli Hasan: పని ఒత్తిడితో 'గే'లుగా మారుతున్నారా?.. మలేషియా మంత్రి వింత వ్యాఖ్యలపై దుమారం!

Work Stress Makes People Gay Malaysian Ministers Bizarre Remark Sparks Online Mockery
  • పని ఒత్తిడితో ప్రజలు ఎల్జీబీటీగా మారుతున్నారన్న మలేషియా మంత్రి
  • పార్లమెంటులో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు
  • ఇది తప్పుడు సమాచారం, వెంటనే వెనక్కి తీసుకోవాలన్న హక్కుల సంఘాలు
  • సోషల్ మీడియాలో మంత్రిని ఎండగడుతున్న నెటిజన్లు
ఉద్యోగంలో పని ఒత్తిడి, సామాజిక ప్రభావం వంటి కారణాల వల్ల ప్రజలు 'ఎల్జీబీటీ కమ్యూనిటీ'లో భాగమవుతున్నారంటూ మలేషియాకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పార్లమెంటులో రాత‌పూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, దీనిపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం మత వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ జుల్కిఫ్లి హసన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్జీబీటీ ధోరణులపై ప్రతిపక్ష ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన ఎంపీ సితి జైలా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పని ఒత్తిడి, సామాజిక ప్రభావం, మత విశ్వాసాలు లోపించడం వంటివి 'ఎల్జీబీటీ ప్రవర్తన'కు కారణాలని ఆయన పేర్కొన్నారు. మలేషియాలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని, 2022 నుంచి 2025 మధ్య ఎల్జీబీటీ సంబంధిత కార్యకలాపాలపై 135 కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన ప్రకటనను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. "ఈ లెక్కన మా ఆఫీసులో ఉన్నవాళ్లంతా ఎప్పుడో గేలుగా మారిపోవాలి" అని ఒకరు కామెంట్ చేయగా, "ఒత్తిడి, బైసెక్సువల్ రెండూ నాకు ఉన్నాయి. బహుశా మంత్రి చెప్పింది నిజమేనేమో" అని మరో యూజర్ వ్యంగ్యంగా రాశారు. మరికొందరు దీన్ని కార్మిక హక్కులతో ముడిపెడుతూ "జనాలు గేలుగా మారకుండా ఉండాలంటే ప్రభుత్వం కనీస వేతనాలు పెంచి, నాలుగు రోజుల పనిదినాలు ప్రవేశపెట్టాలి" అంటూ చురకలు అంటించారు.

హక్కుల సంఘాల ఆగ్రహం
మరోవైపు మానవ హక్కుల సంఘాలు మంత్రి వ్యాఖ్యలను 'తప్పుడు సమాచారం'గా కొట్టిపారేశాయి. 'జస్టిస్ ఫర్ సిస్టర్స్' అనే ఎల్జీబీటీ హక్కుల సంస్థ ప్రతినిధి తిలగా సులతిరేహ్ మాట్లాడుతూ.. లైంగిక గుర్తింపు అనేది ఒత్తిడి వల్ల వచ్చేది కాదని, అది మానవ సహజమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసిందని గుర్తుచేశారు. మంత్రి వ్యాఖ్యలు ఎల్జీబీటీ వర్గాలను కించపరిచేలా ఉన్నాయని, ఆయన తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Zulkifli Hasan
Malaysia
LGBT
work stress
social influence
homosexuality
Malaysian minister
LGBT rights
South China Morning Post
sexuality

More Telugu News