బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదు.. వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా: దానం నాగేందర్

  • బీఆర్ఎస్ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన దానం నాగేందర్
  • మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బీఆర్ఎస్ నేను పార్టీ మారినట్లు భావిస్తోందని వెల్లడి
  • బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయలేదన్న దానం నాగేందర్
నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లానని, దీంతో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని సభాపతిని కోరారు.

2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచానని, ఆ పార్టీకి తాను రాజీనామా చేయలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఓసారి కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినప్పటికీ వ్యక్తి గత హోదాలో వెళ్లానని పేర్కొన్నారు. ఆ పార్టీ అనర్హత పిటిషన్‌లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి తన అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని అన్నారు.

అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని దానం నాగేందర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని దానం నాగేందర్‌కు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.


More Telugu News