పిల్లాడికి టికెట్ కొనకుండానే విమానం ఎక్కిన కుటుంబం.. దించేసిన సిబ్బంది!

  • ఖాళీగా ఉన్న సీటులో కూర్చోబెట్టి తోటి ప్రయాణికుడితో వాగ్వాదం
  • బాబుకు టికెట్ కొనలేదని గుర్తించి దింపేసిన సిబ్బంది
  • తొలిసారి విమానం ఎక్కడంతో జరిగిన పొరపాటు
  • కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేసిన పోలీసులు
తొలిసారి విమానం ఎక్కిన ఓ తల్లి, కొడుకు తమ వెంట రెండున్నర సంవత్సరాల మనవడిని కూడా తీసుకెళ్లారు. బస్సు, రైళ్లలో లాగే పిల్లవాడికి టికెట్ తీసుకోకుండానే లోపలికి వెళ్లారు. సిబ్బంది సరిగా గమనించకపోవడంతో విమానంలోకి ఎంటరయ్యారు. చివరి నిమిషంలో గుర్తించిన సిబ్బంది.. బాబుతో పాటు కుటుంబం మొత్తాన్నీ దింపేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తల్లిని తొలిసారి విమానం ఎక్కించాలని, తల్లితో పాటు తాను కూడా ఆ ప్రయాణ అనుభూతిని పొందాలని ఓ కొడుకు పాట్నాకు టికెట్లు బుక్ చేశాడు. చిన్న పిల్లలకు టికెట్ ఉండదనే ఉద్దేశంతో రెండున్నర సంవత్సరాల తన కొడుకునూ వెంట తీసుకెళ్లాడు. సిబ్బంది గమనించకపోవడంతో విమానం లోపలికి వెళ్లిపోయారు. తమ సీట్లలో కూర్చున్నాక పక్కనే ఖాళీగా ఉన్న సీటులో బాబును కూర్చోబెట్టారు.

ఇంతలో ఆ సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు రాగా.. బాబు కూర్చున్నాడుగా వేరే సీటు వెతుక్కోమని తగవు పెట్టుకున్నారు. ఈ గొడవ చూసి అక్కడికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అసలు విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా.. ఆ తల్లీకొడుకులను, మనవడిని విమానంలో నుంచి దించేశారు. అయితే, విమాన ప్రయాణం తొలిసారి కావడంతో బస్సు, రైళ్లలో లాగే పిల్లలకు టికెట్ ఉండదని తాము భావించినట్లు ఆ కొడుకు తెలిపాడు. తెలియక చేసిన పొరపాటని గుర్తించిన పోలీసులు.. కేసు పెట్టకుండా వారిని హెచ్చరించి వదిలేశారు.


More Telugu News