ఐసీసీ సంచలన నిర్ణయం: 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ నిరాకరణ

  • టీ20 ప్రపంచకప్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 150 మంది బంగ్లా జర్నలిస్టులు
  • ఐసీసీ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటూ క్రీడా వర్గాల్లో ప్రచారం
  • జర్నలిస్టులను దూరం పెట్టడంపై బంగ్లాదేశ్ మీడియా సంఘాల నిరసన
టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు భాగస్వామ్యంపై సందిగ్ధత కొనసాగుతుండగా, ఇప్పుడు బంగ్లాదేశ్ మీడియా ప్రతినిధులపై ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. టోర్నీ కవరేజీ కోసం అనుమతి కోరిన సుమారు 150 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇచ్చేందుకు ఐసీసీ నిరాకరించినట్లు సమాచారం.

ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను టోర్నీకి దూరం పెట్టడం వెనుక భౌగోళిక రాజకీయ కారణాలతో పాటు భద్రతాపరమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉన్న వారికే అనుమతి నిరాకరించినట్లు ఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సంకేతం. అయితే, దీనిపై ఐసీసీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రీడా జర్నలిస్టుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశం నుంచి వెళ్లే జర్నలిస్టులపై వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. "అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, ఎటువంటి కారణం చూపకుండానే అక్రెడిటేషన్లను తిరస్కరించడం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే" అని వారు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు, అశాంతి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జర్నలిస్టుల ముసుగులో ఎవరైనా అవాంఛనీయ శక్తులు వచ్చే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఐసీసీ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం లేదా ఐసీసీ నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


More Telugu News