విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'రణబాలి'... విలన్ గా హాలీవుడ్ నటుడు

  • విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రణబలి'
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవర్‌ఫుల్ గ్లింప్స్ విడుదల
  • 19వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో పాన్-ఇండియా చిత్రం
  • విజయ్‌కు జోడీగా రష్మిక.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం
  • 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రణబాలి' అనే శక్తిమంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ ఏవీ (ఆడియో విజువల్) గ్లింప్స్‌ను, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలోని క్రూరత్వాన్ని, వారు సృష్టించిన కరవు పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. హిట్లర్ మారణహోమం కంటే దారుణంగా భారతీయుల సంపదను దోచుకున్నారని వివరిస్తూ, చివర్లో విజయ్ దేవరకొండను 'రణబాలి'గా పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "బ్రిటిషర్లు అతడిని అనాగరికుడు అన్నారు. నేను కాదనను. అతను మన అనాగరికుడు" అని విజయ్ వ్యాఖ్యానించారు.

1854-1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో నటిస్తున్నారు. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌తో విజయ్‌కు ఇది మూడో సినిమా. ప్రతినాయకుడిగా ఆర్నాల్డ్ వోస్లూ ('ది మమ్మీ సిరీస్ చిత్రాల నటుడు) నటిస్తుండగా, ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.


More Telugu News