సంతోష్ కుమార్‌కు నోటీసులు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు
  • ఇవి రాజకీయ కక్ష సాధింపు చర్యలేనన్న హరీశ్ రావు
  • గవర్నర్‌ను కలవనున్న నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారని ఆరోపణ
  • ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని విమర్శ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సిట్ నోటీసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఒక ఆయుధంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టేందుకు బీఆర్ఎస్ నేతల బృందం రేపు సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న నేపథ్యంలో, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హడావుడిగా సంతోష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు విమర్శించారు.

గతంలో తాను బొగ్గు కుంభకోణం అంశాన్ని బయటపెట్టినప్పుడు తనకూ నోటీసులు ఇచ్చారని, అదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించినప్పుడు ఆయనకూ సిట్ నోటీసులు పంపారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇది కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధించడమేనని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు.


More Telugu News