57 బంతుల్లోనే 100 పరుగులు... డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ

  • డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ బాదిన నాట్ సివర్ బ్రంట్
  • 57 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచిన సివర్
  • హేలీ మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భారీ భాగస్వామ్యం
  • ఆర్సీబీకి 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ సివర్-బ్రంట్ ఈ లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. వడోదరా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ అద్భుత ఘనతను అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సివర్-బ్రంట్ కేవలం 57 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 100 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (39 బంతుల్లో 56) కూడా రాణించడంతో వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యమే ముంబై భారీ స్కోరుకు పటిష్టమైన పునాది వేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే సజీవన్ సజన (7) వికెట్ రూపంలో షాక్ తగిలింది. అయితే సివర్, మాథ్యూస్ జోడీ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) కూడా వేగంగా ఆడటంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 21 పరుగులిచ్చి 2 వికెట్లతో ఆకట్టుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై, ప్రత్యర్థి ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.




More Telugu News