బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు... చెప్పాపెట్టకుండా వచ్చేసిన ఎన్టీపీసీ ఇంజినీర్లు

  • బంగ్లా హింసాత్మక దాడుల్లో పలువురు హిందువుల మృతి
  • అకస్మాత్తుగా బంగ్లాను వీడిన 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు
  • ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు మరింత పెరిగే అవకాశం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై కొనసాగుతున్న హింసాత్మక దాడులు ఆ దేశంలోని భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. గత కొన్ని నెలలుగా అనేక ప్రాంతాల్లో హిందువుల ఇళ్లు, ఆలయాలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు మరణించారు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న భారతీయులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఫలితంగా, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులతో పాటు కేంద్ర సంస్థల ఉద్యోగులు కూడా ఆ దేశాన్ని వీడుతున్నారు. భారత రాయబార కార్యాలయం సూచనల మేరకు చాలా మంది తమ కుటుంబ సభ్యులను ఇండియాకు పంపించారు.


తాజా ఘటనలో, కేంద్ర విద్యుత్ రంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన 9 మంది ఇంజినీర్లు బంగ్లాదేశ్‌ను అకస్మాత్తుగా వీడి ఇండియాకు తిరిగి వచ్చారు. ఇండియా-బంగ్లాదేశ్ మైత్రి ఒప్పందం కింద బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ (BIFPCL) పేరిట నిర్వహిస్తున్న రాంపాల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఈ ఇంజినీర్లు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. అయితే, దేశంలో నెలకొన్న అల్లర్లు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో వారు గత శనివారం భోమ్రా సరిహద్దు మార్గం ద్వారా ఇండియాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, వారు అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే, నోటీసు ఇవ్వకుండానే దేశం వీడారు. పవర్ ప్లాంట్ అధికారులు తనిఖీ చేసినప్పుడు వారు విధులకు హాజరు కాలేదని తెలిసి ఆశ్చర్యపోయారు.


బంగ్లాదేశ్‌లో గత ఆగస్టు 2024 నుంచి జూన్ 2025 వరకు హిందువులపై 2,442కు పైగా దాడి ఘటనలు జరిగాయని హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (HBCUC) తెలిపింది. ఈ దాడులు రాజకీయ అస్థిరత, మత ఛాందసవాదం కారణంగా పెరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ హింస మరింత తీవ్రమవుతుందని హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.



More Telugu News