బీసీ కార్డు వాడినంత మాత్రాన అమాయకుడైపోతాడా?: జోగి రమేశ్ పై వాసంశెట్టి ఫైర్
- కల్తీ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన జోగి రమేశ్
- ఏ ప్రమాణానికైనా సిద్ధమన్న రమేశ్
- అడ్డంగా దొరికిపోయి దొంగ ప్రమాణాలు చేస్తే ఎలాగన్న వాసంశెట్టి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై ప్రస్తుత మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత... తాను తప్పు చేయలేదని, ఏ ప్రమాణానికైనా సిద్ధమని జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సుభాష్ స్పందిస్తూ... "కేసులో అడ్డంగా దొరికిపోయి... దొంగ ప్రమాణాలు చేస్తే ఎలా?" అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేశ్ మంత్రిగా ఉండి, వీధి రౌడీలా వ్యవహరించారని మండిపడ్డారు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఏ ప్రమాణానికైనా సిద్ధమని చెప్పడంపై వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. "కల్తీ మద్యంతో పాటు అగ్రిగోల్డ్ కేసులో కూడా సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు. బీసీ కార్డు వాడినంత మాత్రాన జోగి రమేశ్ అమాయకుడైపోతాడా అని నిలదీశారు. వైసీపీ చేసిన పాపాలకు దేవుడు వారిని 11 సీట్లకే పరిమితం చేశాడని సుభాష్ విమర్శించారు. జోగి రమేశ్ 83 రోజుల పాటు జైలులో ఉన్నారని, 8+3=11 అవుతుందని ఎద్దేవా చేశారు.