రష్యాలో కార్మికుల కొరత.. భారీగా భారతీయుల నియామకానికి రంగం సిద్ధం

  • కార్మికుల కొరతతో రష్యాలో భారీగా భారతీయ నియామకాలు
  • ఈ ఏడాది 40,000 మందిని తీసుకోనున్నట్లు అంచనా
  • కార్మికుల తరలింపుపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
  • రష్యాలో 30 లక్షల మంది నైపుణ్య నిపుణుల కొరత
  • ఇప్పటికే 80,000 మంది భారతీయులు రష్యాలో పని చేస్తున్నట్లు సమాచారం
తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రష్యా, ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు భారత్ వైపు చూస్తోంది. ఈ ఏడాది దాదాపు 40,000 మంది భారతీయ కార్మికులను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సుమారు 70,000 నుంచి 80,000 మంది భారతీయులు గత ఏడాది చివరి నాటికి రష్యాలో పనిచేస్తున్నట్లు అంచనా.

భారతదేశం నుంచి నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులను రష్యాకు పంపించే ప్రక్రియను సులభతరం చేసేందుకు గత డిసెంబర్‌లో ఇరు దేశాలు రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ద్వారా కార్మికుల తరలింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు, గతంలో జరిగిన మోసాల వంటివి పునరావృతం కాకుండా వారికి రక్షణ కల్పించనున్నారు.

dw.com కథనం ప్రకారం, రష్యాలో దాదాపు 5 లక్షల మంది పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు డిమాండ్ ఉంది. మొత్తం మీద 30 లక్షల మంది నిపుణుల కొరతను ఆ దేశం ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించారు. భారతదేశంలోని యువత, నైపుణ్యం గల శ్రామిక శక్తి ఈ లోటును తీర్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులు శుభ్రం చేసే పనిలో ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సహా 17 మంది కార్మికులు ఉన్నట్లు రష్యన్ మీడియా 'ఫొంటాంకా' నివేదించడం గమనార్హం. మున్సిపల్, ఇతర సేవా రంగాల్లో కార్మికుల అవసరం పెరగడంతో రష్యా.. భారత్ వంటి మిత్రదేశాల నుంచి నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది.


More Telugu News