‘చిరంజీవికి చెడ్డపేరు తేవద్దు’.. ఆ మాటే అనిల్ రావిపూడిని మార్చింది: అనిల్ రావిపూడి తండ్రి

  • 'మన శంకర వరప్రసాద్' బ్లాక్‌బస్టర్ విజయం
  • సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైన అనిల్ రావిపూడి తండ్రి
  • "చిరంజీవి వల్ల చెడిపోయావనొద్దు" అన్న మాటే కొడుకుని మార్చిందని వెల్లడి
  • చిరంజీవి స్వయంగా భోజనం పెట్టిన క్షణాలను గుర్తుచేసుకున్న వైనం
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్’. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ ఎన్నో ఆసక్తికర, భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి చేసిన ప్రసంగం అందరినీ కదిలించింది. తన కుమారుడి జీవితంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

అనిల్ రావిపూడి గుంటూరులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని ఆయన తండ్రి వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి వేదికలపై వైఫల్యాల గురించి మాట్లాడరని, కానీ అదే తన కొడుకు జీవితంలో కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు. అనిల్ చిన్నప్పటి నుంచీ చిరంజీవికి వీరాభిమాని అని, సినిమాలపై ఉన్న ఇష్టంతోనే చదువులో వెనుకబడ్డాడని తెలిపారు. ఆ సమయంలో తండ్రిగా తాను, "చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారనే చెడ్డపేరు ఆయనకు తీసుకురావద్దు" అని చెప్పిన ఒకే ఒక్క మాట అనిల్‌ను తీవ్రంగా ఆలోచింపజేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత పట్టుదలతో చదివి ఫస్ట్ క్లాస్ మార్కులతో సబ్జెక్టులు పూర్తి చేశాడని గర్వంగా చెప్పారు.

ఒకప్పుడు చిరంజీవిని దూరం నుంచి చూడటానికే అభిమానులు తపించేవారని, అలాంటిది తన కొడుకు ఆయననే డైరెక్ట్ చేయడం దేవుడిచ్చిన వరమని భావోద్వేగానికి గురయ్యారు. కేరళ షూటింగ్ సమయంలో చిరంజీవి తనను ఆప్యాయంగా పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా భోజనం వడ్డించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ రోజు చిరంజీవి స్టైల్ చూసే ఈ సినిమా రూ. 400 నుంచి 500 కోట్లు వసూలు చేస్తుందని ఆయనతో చెప్పినట్లు వెల్లడించారు. అనిల్ 100 మైళ్ల వేగంతో పనిచేస్తే, చిరంజీవి దాన్ని 200 మైళ్ల వేగానికి తీసుకెళ్లారని ప్రశంసించారు.

ఈ విజయోత్సవ సభలో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకుంటూ, దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. సినిమా అద్భుత విజయం, దర్శకుడి తండ్రి స్ఫూర్తిదాయక ప్రసంగం, చిరంజీవి బహుమతి వంటి అంశాలతో ఈ సక్సెస్ మీట్ సినీ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.


More Telugu News