కోడలిపై ఇలా రివెంజ్ తీర్చుకున్న అత్తగారు!

  • తాగు బోతు భర్తను మంచానికి కట్టేసిన మహిళ  
  • ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఘటన
  • కోడలు సోనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్త
  • భర్తే వేధింపులకు గురి చేస్తున్నాడన్న సోని 
  • సోషల్ మీడియాలో ఫోటో, వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తాగుబోతు భర్తకు భార్య షాక్ ఇవ్వగా, కోడలిపై అత్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, హమీద్‌పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి భార్య సోనిని వేధింపులకు గురిచేసేవాడు. అతని వేధింపులు భరించలేక, ఒకరోజు సోని తన భర్తను మంచానికి కట్టివేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ తల్లి, కోడలు తన కొడుకును మంచానికి కట్టేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆమె కోడలిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. గతంలో సోని తుపాకీతో ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, కోడలు తన కొడుకును తుపాకీతో బెదిరిస్తోందని ఫిర్యాదు చేసింది.

అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు సోని ఇంట్లో సోదాలు నిర్వహించగా, అక్కడ ఎలాంటి ఆయుధాలు లభించలేదు. మరోవైపు, భర్త వేధింపులపై సోని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త నిత్యం మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తున్నాడని, అందుకే తాను అతన్ని మంచానికి కట్టేయాల్సి వచ్చిందని ఆమె పోలీసులకు తెలిపింది. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ భార్యాభర్తల గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 


More Telugu News