మదురోని కిడ్నాప్ చేసినప్పుడు మాకు 15 నిమిషాల సమయం ఇచ్చారు: వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్జ్

  • అమెరికా దాడి అనంతరం వారం రోజుల తర్వాత రోడ్రిగ్జ్ సమావేశ వీడియో లీక్
  • ఈ పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించాల్సి రావడం బాధగా ఉందన్న రోడ్రిగ్జ్
  • స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సహచరులకు సూచన
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన సమయంలో అమెరికా దళాలు తమ మంత్రివర్గ సభ్యుల ముందు ఒక డిమాండ్ ఉంచాయని ఆమె తెలిపారు. అమెరికా డిమాండ్లను అంగీకరిస్తారా లేదా అని నిర్ణయించుకోవడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, లేదంటే తమను చంపేస్తామని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. మదురోను కిడ్నాప్ చేసిన మొదటి నిమిషం నుంచే తమకు బెదిరింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు.

వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి జరిగిన వారం రోజుల తర్వాత రోడ్రిగ్జ్ నిర్వహించిన రెండు గంటల సమావేశానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ ఒకటి లీక్ అయింది.

రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడమే తమ ప్రాధాన్య లక్ష్యమని ఆ వీడియోలో రోడ్రిగ్జ్ స్పష్టం చేశారు. మదురోను కిడ్నాప్ చేసిన అనంతరం వెనెజువెలా అమెరికా నియంత్రణలోకి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆ సమావేశంలో చర్చించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. మదురో కిడ్నాప్ అయిన ఇటువంటి పరిస్థితుల్లో తాను బాధ్యతలు స్వీకరించాల్సి రావడం బాధాకరంగా ఉందని రోడ్రిగ్జ్ పేర్కొన్నట్లు వీడియోలో ఉంది.

వాస్తవానికి, మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను హత్య చేశారని అమెరికా సాయుధ దళాలు మొదట తమకు చెప్పాయని ఆమె వెల్లడించారు. తాను, తన సోదరుడు, మంత్రి కాబెల్లోలు దేనికైనా సిద్ధంగా ఉన్నామని వారితో చెప్పామని అన్నారు. ఆ రోజు అమెరికా సైన్యం ముందు చేసిన ప్రకటనకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆమె ఆ సమావేశంలో పేర్కొన్నారు. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

మనం స్పష్టమైన లక్ష్యాలతో, సహనంతో, వ్యూహాత్మక వివేకంతో ముందుకు సాగాలని రోడ్రిగ్జ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మూడు లక్ష్యాలను ప్రస్తావించారు. శాంతిని పరిరక్షించడం, బందీలను కాపాడుకోవడం, రాజకీయ అధికారాన్ని రక్షించుకోవడం తమ లక్ష్యాలని ఆమె పేర్కొన్నారు.


More Telugu News