నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు

  • కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ
  • 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు తీసుకువస్తానని వెల్లడి
  • స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన
  • రాష్ట్రవ్యాప్త సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • వలసలు నివారించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలను తీసుకొచ్చి సాగు, తాగునీటి కష్టాలు తీర్చే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక యువత ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా పరిశ్రమలను తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. శనివారం నగరిలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అభివృద్ధిపై కీలక హామీలు ఇచ్చారు.

నగరితో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, "నగరి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నా మిత్రుడు, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం తపించేవారు. గడిచిన ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి" అని వ్యాఖ్యానించారు. 

పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను కూడా సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ నాయుడు, ఎంపీ డి.ప్రసాదరావు తదితర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్యర్థాల సేకరణ కోసం రూపొందించిన 'స్వచ్ఛ రథాల'ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన మెప్మా, డ్వాక్రా మహిళల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి వారిని అభినందించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ పలువురిని సన్మానించారు.

"స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది మనందరి జీవన విధానం కావాలి. ఏడాది క్రితం ఒక ఉద్యమంలా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి నెలా మూడో శనివారం నేతలు, అధికారులు పాల్గొంటున్నారు. ప్రజలంతా భాగస్వాములైతేనే దీని లక్ష్యం నెరవేరుతుంది" అని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రలో సీఎంగా ఉన్నప్పుడు తాను ప్రారంభించిన జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు.



More Telugu News