క్రెడిట్ చోరీ అనేవారికి ఏం క్రెడిట్ ఉంది?: నగరిలో సీఎం చంద్రబాబు

  • నరకాసురుడి లాంటి వ్యక్తి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనమవుతుందన్న చంద్రబాబు
  • ల్యాండ్ టైట్లింగ్ లాంటి దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేశామని వెల్లడి
  • ప్రజల భూములకు రాజముద్రతో భద్రత కల్పించామన్న ముఖ్యమంత్రి
  • గత ఐదేళ్ల రాక్షస పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని విమర్శ
గత ఐదేళ్ల రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని, ఈ కాలంలో రాష్ట్రం అన్ని విధాలుగా అతలాకుతలమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నగరిలో జరిగిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు.

"గత ఐదేళ్లలో రాక్షస పాలన వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాం. 94 శాతం స్టైక్ రేటుతో విజయం సాధించాం. గత పాలనలో అమరావతిపై మూడు ముక్కలాట ఆడారు. శ్మశానం, ఎడారి అన్నారు. ఇప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ అనేవారికి ఏం క్రెడిట్ ఉందని మాట్లాడుతున్నారు?

రాజధానిపైనా విషం చిమ్ముతున్నారు. నాపై నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేలు ఎకరాల భూమి రాజధాని కోసం ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి ఆగదు. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాను. నేడు అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని తయారుచేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. పేదల సేవలో, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. 18 నెలల్లో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. దేశంలో 25 శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే రావడం ఎన్డీఏ ప్రభుత్వ సమర్థత పాలనకు నిదర్శనం" అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజలకు భూమి అంటే సెంటిమెంట్ అని, అలాంటి భూమికి గత ప్రభుత్వంలో భద్రత లేకుండా చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. "ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దుర్మార్గపు చట్టంతో, 22ఏ అక్రమాలతో ప్రజల జీవితాలతో వికృత క్రీడ ఆడారు. సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం కోసం రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు" అని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల భూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని తెలిపారు.

"మేం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాం. రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందించి, మీ భూమికి మేం గ్యారెంటీ అని భరోసా ఇచ్చాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి రాయలసీమను రాళ్ల సీమగా మార్చారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే రాష్ట్రంలో తిరిగి అభివృద్ధి, సంక్షేమ పాలన మొదలైందని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.




More Telugu News