Ved Prakash Singh: భర్త సంపాదన కోల్పోవడానికి భార్య కుటుంబమే కారణమైతే భరణం ఇవ్వలేం: అలహాబాద్ హైకోర్టు

High Court says no maintenance if wifes family caused husbands job loss
  • భార్య సోదరుడు, తండ్రి జరిపిన దాడిలో గాయపడిన భర్త
  • శాశ్వతంగా సంపాదించే సామర్థ్యాన్ని కోల్పోయిన వైనం
  • వెన్నెముకలో బుల్లెట్ ఉండటంతో తన క్లినిక్ మూసివేసి నిరుద్యోగిగా మారిన భర్త
  • ఈ పరిస్థితుల్లో భరణం మంజూరు చేయడం భర్తకు అన్యాయమే అవుతుందన్న కోర్టు
భర్త సంపాదించే సామర్థ్యాన్ని కోల్పోవడానికి భార్య లేదా ఆమె కుటుంబ సభ్యుల చర్యలే కారణమైనప్పుడు, ఆమె భరణం పొందేందుకు అర్హురాలు కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్తకు తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకోలేవని స్పష్టం చేసింది. భార్య దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మీకాంత్ శుక్లా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ వేద్ ప్రకాశ్ సింగ్ అనే హోమియోపతి వైద్యుడికి వినీత అనే మహిళతో వివాహమైంది. 2019 ఏప్రిల్ 13న వేద్ ప్రకాశ్ తన క్లినిక్‌లో ఉండగా, వినీత సోదరుడు, తండ్రి మరో నలుగురితో కలిసి వచ్చి దాడి చేశారు. ఈ క్రమంలో వినీత సోదరుడు జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ (పెల్లెట్) వేద్ ప్రకాశ్ వెన్నెముకలో ఇరుక్కుపోయింది. శస్త్రచికిత్స చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో దానిని తొలగించలేదు. ఈ గాయం కారణంగా ఆయన ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితికి చేరుకుని, తన క్లినిక్ మూసివేసి నిరుద్యోగిగా మారారు.

ఈ నేపథ్యంలో, తనకు జీవనాధారం లేదని పేర్కొంటూ భరణం కోరుతూ వినీత కుషీనగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు భర్త దుస్థితికి ఆమె కుటుంబమే కారణమని తేల్చి, 2025 మే 7న భరణం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వినీత అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన హైకోర్టు.. కింది కోర్టు తీర్పును సమర్థించింది. "భర్త సంపాదించలేని దుస్థితికి భార్య, ఆమె కుటుంబ సభ్యుల చర్యలే కారణమైనప్పుడు, ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఆమె భరణం పొందడానికి అనుమతించలేం. ఇది భర్తకు తీవ్ర అన్యాయం చేయడమే అవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు వినీత పిటిషన్‌ను కొట్టివేస్తూ 2026 జనవరి 19న తీర్పు ఇచ్చింది.
Ved Prakash Singh
Alahabad High Court
maintenance
family court
homeopathy doctor
Veneeta
loss of income
Uttar Pradesh
domestic violence

More Telugu News