అంతరిక్షంపై డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రంగా మారిందన్న సతీష్ రెడ్డి 
  • స్పేస్ అనేది మన జీవితంలో భాగం అవుతుందని విక్రమ్ సారాభాయ్ దశాబ్దాల క్రితమే చెప్పారని వెల్లడి
  • ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతికత నిలిచిపోతే కమ్యూనికేషన్ వ్యవస్థలు, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, టీవీ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోతాయన్న సతీష్ రెడ్డి  
అంతరిక్షం ఇక కేవలం శాస్త్రీయ పరిశోధనలకే పరిమితం కాదని, భూమి (ఆర్మీ), ఆకాశం (ఎయిర్ ఫోర్స్), నీరు (నేవీ) తర్వాత అంతరిక్షమే నాలుగో యుద్ధ క్షేత్రంగా మారిందని డీఆర్డీవో మాజీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వేదికగా విజ్ఞాన్స్, ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ - 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరిక్షం మన జీవితంలో భాగమవుతుందని విక్రమ్ సారాభాయ్ దశాబ్దాల క్రితమే చెప్పారని, నేడు అది అక్షరాలా నిజమైందన్నారు. ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతికత నిలిచిపోతే కమ్యూనికేషన్ వ్యవస్థలు, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయం, టీవీ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోతాయని, సామాన్యుడి దైనందిన జీవితం స్తంభించిపోతుందని అన్నారు. సాధారణంగా అంతరిక్షం అంటే ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాలకే పరిమితమవుతామని, అయితే రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత పాత్రను విస్మరించలేమని డాక్టర్ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవ్వగానే, మొదటగా చేసే పని నిర్దేశిత ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక ఉపగ్రహాలను ప్రయోగించడమేనని తెలిపారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు ఇప్పుడు అంతరిక్ష పరిజ్ఞానం కూడా సైన్యంలో అంతర్భాగమైందని చెప్పారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలు లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరాలంటే జీపీఎస్, గ్లోనాస్, భారత్‌కు చెందిన ఐఆర్ఎన్ఎస్ఎస్ (నావిక్) వంటి నావిగేషన్ వ్యవస్థలు తప్పనిసరిగా అవసరమని వివరించారు. శత్రువుల రాడార్ల ఉనికిని గుర్తించే ఎలింట్ పేలోడ్స్ కూడా రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, కమ్యూనికేషన్ వ్యవస్థే రక్షణ రంగానికి ఆయువు పట్టుగా మారిందని డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. 


More Telugu News