కస్టమర్లకు అలర్ట్... బ్యాంకులకు వరుస సెలవులు!

  • వరుసగా బ్యాంకులు నాలుగు రోజులు మూసివేసే పరిస్థితి ఉన్న వైనం
  • షెడ్యుల్ ప్రకారం జనవరి 24 నాలుగో శనివారం, 25 ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు
  • జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపుతో మూత పడనున్న బ్యాంకులు
జనవరి నెలాఖరులో బ్యాంకు పనులు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల చివరలో వరుసగా సెలవులు రానున్నందున బ్యాంకు కార్యకలాపాలకు పెద్ద ఎత్తున అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు అధికారికంగా ఖరారు కాగా, నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

షెడ్యూల్ ప్రకారం జనవరి 24వ తేదీ నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో యథావిధిగా బ్యాంకులు పనిచేయవు. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాలను అమలు చేయాలనే డిమాండ్‌తో జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె గనుక జరిగితే, వినియోగదారులు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉండదు.

ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకు శాఖలలో నేరుగా పూర్తి చేయాల్సిన పనులను వినియోగదారులు ముందుగానే చక్కబెట్టుకోవడం మంచిది. అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం సేవలు వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిజిటల్ లావాదేవీలు, నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ చెకింగ్ వంటి పనులను వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఎప్పటిలాగే చేసుకోవచ్చు. 


More Telugu News