ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు.. ఆధారాలివ్వకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

  • బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసు
  • తనపై ఏడు క్రిమినల్ కేసులున్నాయన్న ఆరోపణలపై తీవ్ర స్పందన
  • రెండు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని ఆదేశం
  • లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక
  • విచారణను అడ్డుకునేందుకే నిరాధార ఆరోపణలని నోటీసులో పేర్కొన్న సజ్జనార్
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రెండు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని కోరుతూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు.

శుక్రవారం ఉదయం ప్రవీణ్ కుమార్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నేతృత్వంలోని సిట్ విచారణ సరికాదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సజ్జనార్‌పై ఉన్న కేసుల విచారణకు మరో సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు పరువుకు నష్టం కలిగించేలా, బాధ్యతారహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. "ఈ తప్పుడు ఆరోపణల ద్వారా సిట్, దాని చీఫ్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, చట్టబద్ధమైన విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. దర్యాప్తు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు" అని సజ్జనార్‌ తెలిపారు.

తనపై ఉన్నాయని ఆరోపిస్తున్న ఏడు క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను నోటీసు అందిన రెండు రోజుల్లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే, పరువు నష్టం దావాతో పాటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News