లైంగిక దాడి కేసులో క్రికెటర్ యశ్ దయాళ్ కు తాత్కాలిక ఊరట

  • అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించిన రాజస్థాన్ హైకోర్టు
  • జనవరి 30 లోపు విచారణ అధికారి ముందు హాజరుకావాలని ఆదేశం
  • మైనర్‌పై లైంగిక దాడి చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు
  • ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని నిందితుడి తరఫు వాదన
ఐపీఎల్ ఛాంపియన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ కు లైంగిక దాడి కేసులో తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయకుండా రాజస్థాన్ హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈ మేరకు జస్టిస్ గణేశ్‌రామ్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 30వ తేదీలోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని యశ్ దయాళ్ ను ఆదేశించారు.

మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో యశ్ దయాళ్ పై జైపూర్‌లోని సంగనేర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై అతను వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఘటన జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని దయాళ్ తరఫు న్యాయవాది చంద్రశేఖర్ శర్మ కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

బాధితురాలిని ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో, ఇతర జట్టు సభ్యుల సమక్షంలోనే కలిశారని, ఒంటరిగా కలవలేదని దయాళ్ తరఫున వాదనలు వినిపించారు. కాన్పూర్‌లో అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్న బాధితురాలు, ఆ తర్వాత కూడా అతనితో కలిసి వేర్వేరు నగరాలకు ఎందుకు ప్రయాణించిందో ఎఫ్ఐఆర్‌లో స్పష్టత లేదని పేర్కొన్నారు.

క్రికెట్ కెరీర్‌లో సాయం చేస్తానని నమ్మించి, 2023లో తనపై యశ్ దయాళ్ పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాన్పూర్‌తో పాటు, ఐపీఎల్ డ్యూటీ కోసం జైపూర్ వచ్చినప్పుడు హోటల్‌లోనూ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోక్సో కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో యశ్ దయాళ్ హైకోర్టును ఆశ్రయించాడు.




More Telugu News