థాంక్యూ పవనన్నా... మీ మాటలే నాకు బలం: మంత్రి నారా లోకేశ్

  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 
  • విద్యా, ఐటీ రంగాల్లో లోకేశ్ చేస్తున్న కృషిని కొనియాడిన పవన్
  • "పవన్ అన్న" అంటూ ఆప్యాయంగా కృతజ్ఞతలు తెలియజేసిన లోకేశ్
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్ అందిస్తున్న సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా, అందుకు లోకేశ్ వినమ్రంగా స్పందించి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవాళ (జనవరి 23) మంత్రి లోకేశ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో లోకేశ్ గారు ముందున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ఆయనకు భగవంతుడు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని ప్రార్థిస్తున్నాను" అని పవన్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ శుభాకాంక్షలపై నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మీ ఆత్మీయ శుభాకాంక్షలకు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు పవన్ అన్న. మీ ప్రోత్సాహకర మాటలు నా సంకల్పానికి మరింత బలాన్నిచ్చాయి. అర్థవంతమైన విద్యా సంస్కరణలు, బలమైన పారిశ్రామిక వాతావరణం, మన యువతకు మెరుగైన అవకాశాల కోసం నా కృషిని కొనసాగిస్తాను. మీ ఆశీస్సులు, మార్గనిర్దేశానికి నా కృతజ్ఞతలు" అని తన పోస్టులో పేర్కొన్నారు


More Telugu News