హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరింపు.. ఈ అంశంపై సిట్‌ను ప్రశ్నించానన్న కేటీఆర్

  • అందులో వాస్తవం లేదని సిట్ అధికారులు వెల్లడించారన్న కేటీఆర్
  • సిట్ విచారణకు పూర్తిగా సహకరించానన్న కేటీఆర్
  • ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్న కేటీఆర్
కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి తాను బెదిరింపులకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను నిజమా అని అడిగితే, అందులో ఎటువంటి వాస్తవం లేదని వారు తనకు తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన అనంతరం, ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇది లీకుల ప్రభుత్వమని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరొకరితో కలిసి తనను విచారించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేటీఆర్ అన్నారు. సిట్ కార్యాలయంలో తాను, పోలీసులు తప్ప మరెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. తనను సాక్షిగా పిలిచారా లేక మరో విధంగా పిలిచారా అనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదేపదే అడిగారని, అసలు విషయమే లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తాము ఎదుర్కొంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము సిట్ విచారణకు భయపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. భయపడితే కోర్టుకు వెళ్లేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. విచారణ పేరుతో వేధింపులు తప్ప సిట్ విచారణలో ఏమీ లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి సన్నిహితుడు తుపాకీతో బెదిరించాడని మంత్రి కూతురు ఆరోపిస్తే చర్యలు తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ కాంట్రాక్టర్‌ను బెదిరించారని ఆరోపణలు వస్తే కూడా చర్యలు లేవని ఆయన అన్నారు. విచారణ సమయంలో తాను అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు దాటవేసే ప్రయత్నం చేశారని, సూటిగా సమాధానం చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News