మాతో ఎవరూ చర్చలు జరపలేదు... ఓ మెసేజ్ పంపారంతే!: బంగ్లాదేశ్ క్రికెటర్ల ఆవేదన

  • భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఆడకూడదన్నది ఏకపక్ష నిర్ణయం
  • మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లు
  • నిర్ణయం తీసుకున్నాకే సమావేశం ఏర్పాటు చేశారని ఆవేదన
  • ఐసీసీ నిధులపైనే ఆధారపడ్డామంటున్న బంగ్లా బోర్డు అధికారి
భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనకూడదన్న నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చించామని ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు క్రికెటర్లు పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం నుంచి కేవలం సందేశం మాత్రమే వచ్చిందని, ఎలాంటి చర్చలు జరగలేదని వారు స్పష్టం చేశారు. 'టెలికామ్ ఏషియా స్పోర్ట్' నివేదిక ప్రకారం.. ఢాకాలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన సమావేశంలో కేవలం నిర్ణయాన్ని తెలియజేశారని, అది సంప్రదింపుల కోసం కాదని ఆటగాళ్లు తెలిపారు.

"అది ఎప్పుడూ చర్చలా అనిపించలేదు. మా అభిప్రాయాన్ని కోరలేదు. మేం గదిలోకి వచ్చేసరికే నిర్ణయం జరిగిపోయింది. ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశం" అని ఓ సీనియర్ క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశారు. టోర్నమెంట్ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని మరో ఆటగాడు పేర్కొన్నారు. తాము అభిప్రాయం చెప్పినప్పటికీ, ఫలితం మారదని అర్థమైందని తెలిపారు.

ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ అని మాజీ క్రికెటర్లు, కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఐసీసీలో బంగ్లాదేశ్ ఏకాకిగా మారుతుందని, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని మాజీ కోచ్ హెచ్చరించారు. మరోవైపు, ఆర్థిక పరంగా కూడా ఇది బోర్డుకు నష్టమేనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. "మాకు పెద్ద స్పాన్సర్లు లేరు, టీవీ రైట్స్ ద్వారా కూడా భారీ ఆదాయం రాదు. మేం ఐసీసీ నిధులపైనే ఆధారపడి ఉన్నాం. ఈ సంక్షోభం నిధులపై ప్రభావం చూపిస్తే కష్టకాలం తప్పదు" అని ఓ బోర్డు అధికారి పేర్కొన్నారు. మొత్తానికి ఇది చర్చల ద్వారా కాకుండా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగానే మిగిలిపోనుందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.


More Telugu News