కార్తీకదీపం సరే... ముందు బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోండి: మహేశ్ గౌడ్

  • కేటీఆర్ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఫైర్
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్య
  • కవితను చెల్లెలుగా గౌరవిస్తానన్న పీసీసీ చీఫ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఈరోజు మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన... వ్యక్తిగత హననం జరుగుతోందని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే విచారణ సాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇద్దరి మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ కుటుంబం అలీబాబా-420 దొంగల మాదిరిగా దోపిడీకి పాల్పడిందని మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ స్టువర్ట్‌పురం దొంగల బ్యాచ్‌లా మారిందన్నారు. ఆరనీకుమా ఈ కార్తీకదీపం అనే ముందు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా చూసుకోవాలని సెటైర్లు వేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం పూర్తిగా హాస్యాస్పదమన్నారు. తోడబుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైనదని, దీనిని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. అధికారులకు కూడా పరిమితులు ఉంటాయని అన్నారు.


కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్‌ను తాను నేరుగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అలాగే బీజేపీ నేతలపై ఉన్న ఈడీ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ కీలక ప్రశ్న లేవనెత్తారు. దేశ భద్రతకు ముప్పుగా మారే శక్తులపై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, అలాంటప్పుడు సినిమా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సినీ తారల ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానంతో తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. 


కల్వకుంట్ల కవితను తాను ఎప్పుడూ చెల్లెలుగానే గౌరవిస్తానని, ఆమె ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నందుకు స్వాగతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు అసలు కారణం వాటాల పంపకంలో తేడాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం మూడు నెలల్లోనే 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. తన మిత్రుడి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని తెలిపారు.



More Telugu News