ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి

  • లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ
  • అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి
  • రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం
  • జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి నష్టమంటూ వ్యాఖ్య
  • తనపై చేసిన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయడంతో పాటు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని, ఆ కోటరీ మాటలు నమ్మితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చిచెప్పారు.

గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ అధికారులు తనను ప్రశ్నించారని, అయితే అసలు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని తాను భావించడం లేదని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. మిథున్ రెడ్డి కోరిక మేరకు శ్రీధర్ రెడ్డి కంపెనీకి సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, కానీ రూ.100 కోట్లు ఏర్పాటు చేయాలని జగన్ తనతో ఎన్నడూ చెప్పలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఈ సందర్భంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. "జగన్ చుట్టూ ఉన్న కోటరీ పెట్టే వేధింపులు, అవమానాలు తట్టుకోలేకపోయాను. ఆ కోటరీయే నన్ను పొగబెట్టి నెమ్మదిగా పార్టీ నుంచి బయటకు పంపించింది. కోటరీలోని కొందరు ఇప్పటికీ తింటూనే ఉన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయింది. ఈ కోటరీ మాటలు నమ్మడం కొనసాగిస్తే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు" అని ఘాటుగా విమర్శించారు.

తాను 'నంబర్ 2' అనే మాట వాస్తవమేనని, కానీ, కేవలం తనపై కేసులు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి మాత్రమే తనను నంబర్ 2గా ప్రచారం చేశారని వాపోయారు. కానీ లాభాలు పంచుకోవడంలో మాత్రం తన స్థానం వంద తర్వాతనే అని అన్నారు. ఇక 'ప్రలోభాలకు లొంగిపోయారు' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకుంటేనే తదుపరి ఆలోచన ఉంటుందని షరతు విధించారు. 

టీడీపీ కూటమిని విడగొడితేనే జగన్‌కు మళ్లీ అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషణ చేశారు. తనకు విశాఖలో ఒక అపార్ట్‌మెంట్ తప్ప మరేమీ లేదని, ఏడాదిగా వ్యవసాయం చేసుకుంటున్నానని, సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.


More Telugu News