మస్క్ తొలగించినా డీలాపడలేదు.. వేల కోట్ల కంపెనీకి అధిపతిగా పరాగ్!

  • టెక్‌ ప్రపంచంలోకి ఘనంగా తిరిగొచ్చిన ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్
  • పారల్లెల్ వెబ్ సిస్టమ్స్ పేరుతో కొత్త ఏఐ స్టార్టప్‌ ప్రారంభం
  • ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 6000 కోట్లకు పైమాటే
  • ఎలాన్ మస్క్ చేతిలో ఉద్యోగం కోల్పోయిన రెండేళ్లకే ఈ విజయం
  • ఖోస్లా వెంచర్స్ నుంచి రూ. 250 కోట్ల భారీ పెట్టుబడులు
'ఎక్స్' (ట్విట్టర్) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు చెప్పగానే, ఎలాన్ మస్క్ ఆయన్ను పదవి నుంచి తొలగించిన ఘటనే గుర్తుకొస్తుంది. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత పరాగ్ టెక్ ప్రపంచంలోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఆయన స్థాపించిన 'పారల్లెల్ వెబ్ సిస్టమ్స్' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఇప్పుడు ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా విలువతో సంచలనం సృష్టిస్తోంది.

2022 అక్టోబరులో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే పరాగ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఫేక్ అకౌంట్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మస్క్ ఆయన్ను అవమానకరంగా ఆఫీసు నుంచి బయటకు పంపించడంతో అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి దాదాపు రెండేళ్ల పాటు పరాగ్ అగర్వాల్ పెద్దగా వార్తల్లో కనిపించలేదు.

అయితే, ఈ విరామంలో ఆయన తన పాత మిత్రులతో కలిసి ఒక కొత్త ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. డెవలపర్స్ కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఈ సంస్థను నిర్మించారు. పరాగ్ ప్రతిభపై నమ్మకంతో ఖోస్లా వెంచర్స్ వంటి ప్రముఖ సంస్థలు సుమారు రూ. 250 కోట్ల ప్రారంభ పెట్టుబడిని అందించాయి.

ముంబై ఐఐటీలో చదువుకున్న పరాగ్ అగర్వాల్, 2011లో సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ట్విట్టర్‌లో చేరారు. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ 2021లో కంపెనీకి సీఈఓ అయ్యారు. ఉద్యోగం కోల్పోయినప్పటికీ నిరాశ చెందకుండా, తన నైపుణ్యంతోనే తిరిగి సమాధానం చెప్పారు. మస్క్ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించగలిగినా, ఆయనలోని ప్రతిభను మాత్రం ఆపలేకపోయారని ఈ విజయం నిరూపిస్తోంది.


More Telugu News