యూఏఈకి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతి.. ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్: సీఎం చంద్రబాబు

  • దావోస్‌లో యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
  • ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి ప్రతిపాదన
  • పారిశ్రామిక పార్కులు, ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై కీలక చర్చలు
  • పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
  • చంద్రబాబు ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి
ఏపీని ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థాని బిన్ అహ్మద్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ నుంచి యూఏఈకి ఉత్పత్తుల ఎగుమతితో పాటు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు.

ఈ సమావేశంలో ఏపీలో 'దుబాయ్ ఫుడ్ క్లస్టర్' ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. యూఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు వీలుగా పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాల నెట్‌వర్క్ విస్తృతంగా ఉందని తెలిపారు. జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రంతో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గల అవకాశాలను కూడా సీఎం వివరించారు. డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, ఏడీ పోర్ట్స్ వంటి ప్రముఖ యూఏఈ కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులను నెలకొల్పాలని ఆయన కోరారు. మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో టాక్వా, మజ్దార్ వంటి కంపెనీలు, ఏడీఐఏ, ముబాద్లా వంటి ఫండింగ్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

అంతేకాకుండా ఏపీలో ఏర్పాటు చేయనున్న స్పేస్, డ్రోన్ సిటీల అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని యూఏఈని చంద్రబాబు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనలపై యూఏఈ మంత్రి థాని బిన్ అహ్మద్ సానుకూలంగా స్పందించినట్లు స‌మాచారం.


More Telugu News