Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు

Chandrababu calls for natural farming at Davos
  • దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటన
  • రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగుకు 18 లక్షల మంది రైతులు సిద్ధం
  • రైతులకు తక్కువ పెట్టుబడి, అధిక ఆదాయంతో పాటు పర్యావరణానికి మేలు అని వివరణ
"ప్రకృతి సాగు చేద్దాం... భూమిని బాగు చేద్దాం" అనే నినాదంతో ఏపీని ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పటంలో అగ్రగామిగా నిలబెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా నిన్న‌ జరిగిన "ప్రకృతి సేద్యం-ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తి" అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచ వేదికపై వివరించారు. రాష్ట్రంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... "ప్రకృతి సేద్యం కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, అది వాతావరణ మార్పులను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధం. ఏపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయ క్షేత్రంగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది రైతులు దాదాపు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విధానం ద్వారా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. మొదటి ఏడాది నుంచే అధిక నికర ఆదాయం లభించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది" అని వివరించారు.

ప్రకృతి వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఎన్నో ప్రయోజనాలు
ప్రకృతి వ్యవసాయం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను కూడా సీఎం నొక్కిచెప్పారు. "ఈ పద్ధతిలో భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నీటి వినియోగం తగ్గడంతో పాటు జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) వృద్ధి చెందుతుంది. భూసారం కూడా పెరుగుతుంది. 'ఫార్మర్ టు ఫార్మర్' పద్ధతిలో అనుభవజ్ఞులైన రైతుల ద్వారా ఇతర రైతులకు శిక్షణ ఇప్పించి, ఈ విధానాన్ని ప్రతి గ్రామానికి విస్తరిస్తున్నాం" అని తెలిపారు.

టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామ‌న్న సీఎం
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ఉందని చంద్రబాబు వెల్లడించారు. "గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, దీనిని రైతుల కోసం ఒక పెద్ద వ్యాపార అవకాశంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడమే మా ధ్యేయం" అని ఆయన అన్నారు.
Chandrababu
AP natural farming
Davos
World Economic Forum
organic farming
sustainable agriculture
farmer training
carbon sequestration
AP agriculture
zero budget natural farming

More Telugu News